అహ్మదాబాద్, 2 అక్టోబర్ (హి.స.) అహ్మదాబాద్లో జరుగుతున్న భారత్,
వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్లో కరీబియన్ జట్టు భారీ ఒత్తిడిని ఎదుర్కొవడంతో టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేక 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్యాగెనరైన్ చాందర్పాల్ డక్ అవుట్ కాగా.. జాన్ కాంప్బెల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో అలిక్ ఆథనేజ్ (12), బ్రాండన్ కింగ్ (13) కూడా ఎక్కువగా రాణించలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్ రోస్టన్ చేజ్ (24), షై హోప్ (26) కొంత ప్రతిఘటన చూపినా అది భారీ స్కోరు కోసం సరిపోలేదు. ఇక విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో జస్టిన్ గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మహమ్మద్ సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. అలాగే జస్త్రీత్ బుమ్రా 14.1 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 6.1 ఓవర్లలో 25 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి వికెట్లు తీయలేకపోయినా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు