అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)
, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈల్లో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు(పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025)కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడిదారులతో సీఎం భేటీ అయ్యి విశాఖ సదస్సుకు ఆహ్వానించనున్నారు. సీఎంతోపాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు. కాగా, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఈ నెల 18న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం(ఎ్‌సవీపీ)లో పాల్గొనాలని పంపిన ఆహ్వానం మేరకు లోకేశ్ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అక్కడి కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో లోకేశ్ సమావేశం కానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ