తిరుమల, 2 అక్టోబర్ (హి.స.) శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ చరిత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారి అని అన్నారు. టీటీడీ కల్పించిన సదుపాయాలు, సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు మలప్ప స్వామిని దర్శించుకున్నారన్నారు.
అలాగే కానుకాల ద్వారా రూ 25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారన్నారు. ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 4.40 లక్షల మంది భక్తులు.. తిరుమల నుంచి తిరుపతికి 5.22 లక్షలు మంది భక్తులు ప్రయాణించారని టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV