నాగ్‌పూర్, 2 అక్టోబర్ (హి.స.) స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వావలంబన సాధించడం ద్వారానే దేశం ముందుకు సాగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అమెరికా వంటి దేశాలు భారత వస్తువులపై టారిఫ్‌లతో ఒత్తిడి పెంచుతున్న ప్రస్తుత తరుణంలో మన కాళ్లపై మనం నిలబడటమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. గురువారం నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు.
ప్రపంచ దేశాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయని, అయితే ఈ పరస్పర ఆధారం మన బలహీనతగా మారకూడదని భగవత్ హితవు పలికారు. స్వదేశీకి, స్వావలంబనకు ప్రత్యామ్నాయం లేదు. మనం ఆత్మనిర్భర్‌గా మారినప్పుడే మన సంకల్పం ప్రకారం నడుచుకోగలుగుతాం అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా పొరుగు దేశమైన నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళనల గురించి ఆయన ప్రస్తావించారు. హింసాత్మక తిరుగుబాట్లు దేన్నీ సాధించలేవని, అవి కేవలం అరాచకానికి దారితీస్తాయని హెచ్చరించారు. దేశంలో అశాంతి నెలకొంటే విదేశీ శక్తులు జోక్యం చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ అరాచక విధానానికి ముగింపు పలకాలి అని ఆయన అన్నారు. ప్రభుత్వంతో విభేదాలు ఉంటే వాటిని చట్టబద్ధమైన మార్గాల్లోనే తెలియజేయాలని సూచించారు.
అంతకుముందు, మోహన్ భగవత్ విజయదశమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా 'శస్త్ర పూజ' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయ ఆయుధాలతో పాటు పినాక ఎంకే-1, పినాక ఎన్‌హాన్స్‌డ్ వంటి ఆధునిక ఆయుధాల నమూనాలు, డ్రోన్‌లను కూడా ప్రదర్శనకు ఉంచడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరు కాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV