అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)అమరావతి, అక్టోబర్ 2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చేతుల మీదుగా విజయవాడలో ఈనెల 6న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025(Swachh Andhra Awards 2025) ప్రదానం చేయనున్నారు. మొత్తం 21 కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లాల్లో 1257 అవార్డులు బహుకరించనున్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల తరహాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను రాష్ట్రం ఇస్తోంది.
స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్ , స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్సు స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు. మూడు దశల్లో వెరిఫికేషన్ తర్వాత పూర్తి డిజిటల్ విధానంలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి.
అవార్డులకు ఎంపికైన మునిసిపాలిటీలు: మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూ రు(నెల్లూరు జిల్లా), కుప్పం
అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలు: చౌడువాడ (అనకాపల్లి జిల్లా), ఆర్.ఎల్.పురం (ప్రకాశం జిల్లా), లోల్ల(కోనసీమ జిల్లా), చల్లపల్లి (కృష్ణా జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ కడప జిల్లా),కనమకుల పల్లె (చిత్తూరు జిల్లా)
అద్భుత ప్రతిభ కనబరిచిన పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ లు, స్వయం సహాయక సంఘాలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV