అమరావతి, 2 అక్టోబర్ (హి.స.) ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ మండిపడ్డారు. “రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు చంద్రబాబు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో సాగునీరు, తాగునీరు లేక అనేక ప్రాంతాలు ఎడారిలా మారే ప్రమాదం ఉంది. అయినా మీరు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు” అని విమర్శించారు. అయితే ఇది తొలిసారి కాదని ఆయన గుర్తు చేశారు. 1995–2004 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే ఆల్మట్టి స్పిల్‌వే, గేట్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, అప్పట్లో కేంద్రంలో ఉన్న ప్రభావాన్ని ఉపయోగించకపోవడాన్ని జగన్ తీవ్రంగా విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV