అమరావతి/డెట్రాయిట్, 20 అక్టోబర్ (హి.స.)
అమెరికాలో ఉంటోన్న తెలుగు తేజం, డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరికి హెన్రీ ఫోర్డ్ పురస్కారం లభించింది. అమెరికా డెట్రాయిట్‌లోని హెన్రీ ఫోర్డ్ హెల్త్ సంస్థలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ విశిష్ఠ సేవా పురస్కారం దక్కింది. గతంలో ఆయన హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో పలు విభాగాల్లో పని చేసి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ మెడిసిన్ సేవల విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. గడచిన 3 దశాబ్దాల్లో వందల మంది వైద్యులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. డాక్టర్ వేములపల్లి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని వేలేరు. మద్రాసు స్టాన్లీ మెడికల్ కళాశాల నుంచి 1982లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నాక ఇంగ్లాండ్‌లో ఎఫ్‌ఆర్‌సీఎస్ చేశారు. 1995-1998 మధ్య హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో సేవలందించారు. హెన్రీ ఫోర్డ్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఈ నెల 23న డెట్రాయిట్‌లోని సెయింట్ మార్టినస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర చౌదరికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ