అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)
విమానాశ్రయానికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అనుభవం ఇది. భద్రతా తనిఖీల్లో సిబ్బంది బ్యాగులోంచి ల్యాప్‌టాప్‌లు బయటకు తీయండి అని చెప్పడం, మనం కాస్త చిరాకుగా దాన్ని బయటకు తీసి ట్రేలో పెట్టడం సర్వసాధారణం. అయితే, ఈ చిన్నపాటి అసౌకర్యం వెనుక ప్రయాణికుల భద్రతకు సంబంధించిన బలమైన కారణాలున్నాయి. ఇది కేవలం సమయం వృధా చేసే ప్రక్రియ కాదు, ప్రతి విమాన ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి తీసుకుంటున్న ఒక కీలకమైన చర్య.
ల్యాప్‌టాప్‌ల లోపల ఉండే బ్యాటరీ, మదర్‌బోర్డ్, ఇతర మెటల్ భాగాలు చాలా మందంగా ఉంటాయి. వీటిని బ్యాగులో ఉంచి ఎక్స్-రే స్కానర్ ద్వారా పంపినప్పుడు, దాని కింద ఉన్న ఇతర వస్తువులు స్పష్టంగా కనిపించవు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్మగ్లర్లు, సంఘ విద్రోహ శక్తులు ల్యాప్‌టాప్‌ల కేసింగ్‌లలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు లేదా ఇతర ప్రమాదకరమైన వస్తువులను దాచిపెట్టే ప్రమాదం ఉంది. 2022లో వర్జీనియాలోని ఓ విమానాశ్రయంలో ల్యాప్‌టాప్ కేసింగ్‌లో దాచిన కత్తిని గుర్తించారు. ఇలాంటి ఘటనల వల్లే ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థలు ల్యాప్‌టాప్‌లను విడిగా స్కాన్ చేయాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నాయి.
అగ్ని ప్రమాదాల నివారణ
ల్యాప్‌టాప్‌లలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలు అత్యంత శక్తివంతమైనవి. ఒకవేళ ఆ బ్యాటరీలు పాడైనా, దెబ్బతిన్నా అవి వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ల్యాప్‌టాప్‌ను విడిగా స్కాన్ చేసినప్పుడు, దాని బ్యాటరీ పరిస్థితిని అంచనా వేయడానికి భద్రతా సిబ్బందికి సులభంగా ఉంటుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే తదుపరి పరీక్షలకు పంపుతారు. విమానం గాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికే ఈ ముందు జాగ్రత్త.
సమయం ఆదా చేసేందుకే..!
ల్యాప్‌టాప్‌ను బయటకు తీయడం వల్ల సమయం వృధా అవుతుందని చాలామంది అనుకుంటారు, కానీ వాస్తవానికి ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. ల్యాప్‌టాప్‌తో కలిపి బ్యాగును స్కానింగ్‌కు పంపితే, ఎక్స్-రే చిత్రాలు అస్పష్టంగా వస్తాయి. దీంతో సిబ్బందికి అనుమానం వచ్చి, బ్యాగును పక్కకు తీసి మాన్యువల్‌గా తనిఖీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల క్యూలో ఉన్న అందరి సమయం వృధా అవుతుంది. అదే ల్యాప్‌టాప్‌ను ముందుగానే వేరు చేస్తే, స్కానింగ్ వేగంగా పూర్తయి క్యూ ముందుకు కదులుతుంది.
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోని విమానాశ్రయాల్లో అత్యాధునిక 3D స్కానర్లను ప్రవేశపెడుతున్నారు. వీటి ద్వారా ల్యాప్‌టాప్‌లను బయటకు తీయకుండానే తనిఖీ చేయవచ్చు. అయితే, ప్రపంచంలోని చాలా విమానాశ్రయాల్లో ఇప్పటికీ పాతతరం ఎక్స్-రే మెషీన్లే వాడుకలో ఉన్నాయి. కాబట్టి, ఈ టెక్నాలజీ అంతటా అందుబాటులోకి వచ్చే వరకు, ప్రయాణికులు ఈ భద్రతా నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV