ఢిల్లీ,21,, అక్టోబర్ (హి.స.) ప్రముఖ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సేవల్లో సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమస్యను పరిష్కరించినట్లు తాజాగా అమెజాన్ వెల్లడించింది. తమ వ్యవస్థలన్నీ తిరిగి ఆన్‌లైన్‌లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
వెబ్ అడ్రెస్‌లను ఐపీ అడ్రెస్‌లలోకి మార్చే డొమైన్ నేమ్ సిస్టమ్‌లో లోపాన్ని గుర్తించి, దాన్ని సరి చేశామని పేర్కొంది. అయితే, ఇంకా తమకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్లు కొందరు యూజర్లు పోస్టులు పెడుతున్నారు. దీనికి అమెజాన్ స్పందిస్తూ యూజర్లు తమ క్యాచీలు, టెంపరరీ స్టోరేజీలను క్లియర్ చేసుకోవాలని సూచించింది.
భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్య ఎదురైంది. దీంతో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌పై ఆధారపడిన వెబ్‌సైట్లు, యాప్ సేవలు నిలిచిపోయాయి. దీంట్లో స్నాప్‌చాట్, జూమ్, డ్యులింగో, కాన్వా, సిగ్నల్, వర్డ్‌లీ, పోకేమాన్ గో వంటి యాప్స్/ గేమ్స్ ఉన్నాయి. పలుచోట్ల బ్యాంకింగ్ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ