అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)
Updated : 03 Oct 2025 14:12 IST
తిరుపతి (తితిదే): తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్, లింకు బస్టాండ్, విష్ణునివాసం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం ఉదయం దాదాపు రెండు గంటలపాటు తనిఖీలు చేశారు.
తమిళనాడులోని పలు రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు మెయిల్స్‌లో తిరుపతి పేరు ఉన్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అప్రమత్తమైంది. తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల్లో విస్త్రతంగా తనిఖీలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఆరు ప్రాంతాల్లో క్షుణ్ణంగా జల్లెడ పట్టే కార్యక్రమం చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని పోలీస్ శాఖ అనధికారికంగా తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ