అంబేద్కర్ విగ్రహానికి అవమానం.. సీఎం చంద్రబాబు సీరియస్
అమరావతి, 3 అక్టోబర్ (హి.స.) చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ
చంద్ర బాబు


అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)

చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే... దేవళంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న ఓ షెడ్డుకు కొందరు ఆగంతుకులు గురువారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ మంటలు క్రమంగా విగ్రహానికి వ్యాపించడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande