శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు జలకళ... గేట్లు ఎత్తి నీటి విడుదల
అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి, లక్షల
nagarjuna g-water-released


అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి, లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి.

వివరాల్లోకి వెళితే... జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం దాదాపు పూర్తిస్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టులోకి 3,95,563 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 10 స్పిల్ వే గేట్లను ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 209.15 టీఎంసీలకు చేరుకుంది. మొత్తం ఔట్ ఫ్లో 3,46,374 క్యూసెక్కులుగా నమోదైంది.

మరోవైపు, శ్రీశైలం నుంచి వస్తున్న నీటికి తోడు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. సాగర్‌లోకి 2.94 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు ఏకంగా 22 క్రస్ట్ గేట్లను ఎత్తి 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు మొత్తం ఔట్ ఫ్లో 2.22 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 302.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఏకకాలంలో తెరవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande