చిత్తూరు జిల్లా,, 4 అక్టోబర్ (హి.స. ,:డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు వంగలపూడి అనిత, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామికి సూచించారు. ఈ ఘటన టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య రాజకీయ రగడకు ఆజ్యం పోసింది. వివిధ పార్టీల శ్రేణులు, దళిత సంఘాల ప్రతినిధులు దేవళంపేట చేరుకొని దోషులను కఠినంగా శిక్షించాలని నిరసనలకు దిగారు. ఈ ఘటన వెనుక వున్న బొమ్మయ్యపల్లె సర్పంచ్ గోవిందయ్య, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులపై కేసు నమోదు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బొమ్మయ్యపల్లె గ్రామ కార్యదర్శి రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. పాక్షికంగా కాలిపోయిన విగ్రహం స్థానంలో కొత్తగా అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. శుక్రవారం రాత్రి 8గంటలకు కొత్త విగ్రహానికి పాలాభిషేకం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. కాగా, అంబేడ్కర్‌కు అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి డోలా హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ