అమరావతి, 4 అక్టోబర్ (హి.స.)రాజధాని అమరావతిలో పనుల వేగవంతంకోసం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను (ఎస్పీవీ) ఏర్పాటుచేస్తూ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ చట్టం కింద దీనిని ఏర్పాటుచేస్తారు. అలాగే, గతంలో భూసేకరణ నోటిఫికేషన్ నుంచి 343.36ఎకరాల భూమిని ఉపసంహరించుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు క్యాబినెట్ అనుమతిని ఇచ్చింది. నీటి సంఘాల సభ్యుల ఎంపికకు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించింది. దీనికోసం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇద్దరుకన్నా ఎక్కువమంది పిల్లలున్నా, ఈ పదవుల్లో కొనసాగటానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇలాంటి కీలక నిర్ణయాలెన్నింటినో తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి మీడియాకు వెల్లడించారు. మంత్రిమండలిలో వ్యక్తిగత ఎజెండాలేవీ లేవని, ప్రజా సమస్యలపైనా చర్చించామని పార్థసారఽథి తెలిపారు. ‘‘రాజధాని ప్రాంతంలో రెండో దశ భూసేకరణ అంశంపై క్యాబినెట్‌లో చర్చ జరగలేదు. స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు, దీపం-2 పథకం లబ్ధితోపాటు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. అర్హులైన ప్రతి పేదకూ ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం’’ అని మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ