చిత్తూరు, 4 అక్టోబర్ (హి.స.) చిత్తూరులోని మురకంబట్టు టౌన్ పార్క్‌లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. నిందితులను పోలీస్ మార్క్ ట్రీట్మెంట్‌తో అవమానపరిచేలా చేశారు.
ముగ్గురు నిందితులకు బేడీలు వేసి, చెప్పులు తీయించి స్థానిక డీపీవో కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకూ ప్రజలందరికీ కనిపించేలా కిలోమీటరు మేర నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. న్యాయస్థానంలో నిందితులను హాజరుపర్చగా, న్యాయమూర్తి వారికి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. గత నెల 25న మురకంబట్టులోని పార్క్‌లో ఓ బాలిక తన స్నేహితుడితో కలిసి ఉండగా, వారి వద్దకు మహేశ్, కిశోర్, హేమంత్ ప్రసాద్‌లు వెళ్లారు. తొలుత మహేశ్ ఆ యువకుడితో ఉన్న బాలికను తన సెల్ ఫోన్‌తో వీడియో తీశాడు. అనంతరం వారు బాలిక స్నేహితుడిని నిర్బంధించి, బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలిక స్నేహితుడి వద్ద ఉన్న బంగారు వస్తువులను లాక్కుని వెళ్లిపోయారు.
అయితే, ఆ ఘటన జరిగిన రోజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 29వ తేదీన పార్క్ వద్ద బాధిత యువకుడు, అతని స్నేహితులు, బంధువులు నిందితులను గుర్తించి దేహశుద్ధి చేయగా, వారు పరారయ్యారు. అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి బాలికపై అత్యాచారం జరిగిందని తెలియడంతో ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి పోక్సో కేసు నమోదు చేశారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం డీఎస్పీ సాయినాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ బృందాలు రాష్ట్రంలోని పలు ప్రదేశాలతో పాటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో చిత్తూరు నగర శివారులోని చెన్నమగుడిపల్లె వద్ద నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV