చెన్నై 5 అక్టోబర్ (హి.స.) తమిళనాడులో పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో నేడు కుండపోత వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం మదురై, రామనాథపురం, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, తిరుపత్తూరు, నమక్కల్, తిరుచిరాపల్లి, దిండిగల్, థేని, విరుదునగర్, శివగంగ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దక్షిణ ద్వీపకల్పం, దాని పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్పపీడనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవస్థ బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి తేమను ఎక్కువగా గ్రహిస్తుండటంతో వర్ష తీవ్రత పెరుగుతోందని తెలిపారు. శనివారం కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కృష్ణగిరి జిల్లాలోని హోసూరులో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, దిండిగల్‌లో 11 సెం.మీ., విల్లుపురం జిల్లాలోని అవలూరుపేట, సెమ్మెడు ప్రాంతాల్లో 10 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV