తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)

మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి తుమ్మల చర్చించారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రాలేదని.. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.

గత సంవత్సరం కూడా కేంద్రం కేవలం మద్దతు ప్రకటనకే పరిమితమై, ఎలాంటి కొనుగోళ్లు జరపకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు రూ.535 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సాగు పరిస్థితులు మెరుగవ్వడంతో సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఈ సీజన్ లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande