ముంబై, 9 అక్టోబర్ (హి.స.)బంగారం ధర రోజు రోజుకూ భారీగా పెరిగిపోతోంది. సరికొత్త గరిష్ఠాలను తాకుతూ దూసుకెళ్తోంది. ప్రపంచ స్వర్ణ మండలి తాజా రిపోర్ట్ ప్రకారం బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని తెలుస్తోంది. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రస్తుతం బంగారం ధరలు పెరిగేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల ప్రభావం సైతం ఉంది. అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో వివాదాలు కొనసాగుతుండడం, అమెరికాలో నిరుద్యోగిత పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు, డాలర్ హెడ్జింగ్ వంటివి బంగారం ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమవుతున్నట్లు నివేదిక అంచనా వేసింది. ఈ పరిస్థితులు బంగారంపై పెట్టుబడులను భారీగా పెంచే అవకాశాలను కల్పిస్తున్నాయని, దీని కారణంగానే పసిడి ధర దిగిరావడం లేదని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో అక్టోబర్ 9వ తేదీన 22, 24 క్యారెట్లో గోల్డ్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొత్త రికార్డ్ సృష్టించింది. స్పాట్ గోల్డ్ రేటు 4 వేల డాలర్ల మార్క్ దాటేసింది. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42 డాలర్లకు పైగా పెరగడంతో ఈరోజు 4019 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుపై 1.91 శాతం మేర పెరిగి 48.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములపై మూడు రోజుల్లోనే ఏకంగా రూ.4530 మేర పెరిగింది. ఇవాళ ఒక్కరోజే రూ.1910 పెరగడం గమనార్హం. దీంతో తులం గోల్డ్ రేటు కొత్త రికార్డ్ స్థాయికి చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,23,930 స్థాయిలో ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ఇవాళ రూ.1750 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,13,600 స్థాయికి ఎగబాకింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV