
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 15 నవంబర్ (హి.స.)
ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని నిన్న భద్రతా దళాలు పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ పేల్చివేతను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఖండించారు. అనుమానిత ఉగ్రవాదుల స్నేహితులు, వారి కుటుంబాలపై చర్య తీసుకోవడం లోయలో భయానక వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ఢిల్లీ పేలుడులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ పార్టీ అనుకూలంగా ఉందన్నారు. అయితే ఈ ప్రక్రియలో నిందితులకు చెందిన అమాయక కుటుంబ సభ్యులకు శిక్ష పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మెహబూబా ముఫ్తీ నొక్కి చెప్పారు.
ఉప ఎన్నికల ఫలితాల్లో పీడీపీ పార్టీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా మెహబూబా ముఫ్తీ కశ్మీర్ జిల్లాలోని బుద్గాం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “ఢిల్లీలో జరిగిన ఈ విషాద సంఘటన అనేక మంది ప్రాణాలను బలిగొంది. మొత్తం దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఫలితంగా, కశ్మీర్ అంతటా దాడులు జరిగాయి. ఈ పేలుడుకు సంబంధించిన నిందితులపై చర్యలు తీసుకోవడానికి మేము వ్యతిరేకం కాదు.. కానీ వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను అదుపులోకి తీసుకోవడం లోయలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. పేలుడు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మేము కూడా కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. కానీ.. చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనతో సంబంధం లేని వృద్ధ తల్లిదండ్రులు నివసించే ఇంటిని పేల్చివేయడం, స్నేహితులు, బంధువులను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని నేను నమ్ముతున్నాను.” అని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ