
శ్రీనగర్, 15 నవంబర్ (హి.స.)శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్‌తో సహా 9 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ కీలక విషయాలు వెల్లడించారు. నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఉగ్రదాడి అనే వాదనలను డీజీపీ ఖండించారు. అది ప్రమాదవశాత్తు జరిగిందని.. ఉగ్రదాడి కాదని తెలిపారు.
‘‘ఢిల్లీ పేలుళ్లు, వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్ నుండి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ పదార్థాలు అత్యంత సున్నితమైనవి. వీటిని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచి, గత రెండు రోజులుగా శాంపుల్ కలెక్షన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11:20 గంటలకు ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది’’ అని డీజీపీ తెలిపారు. పోలీసులు ఈ వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని డీజీపీ స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV