
కైలాష్‌పూర్, 15 నవంబర్ (హి.స.)ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహారో ఓ ఇంట్లో కనిపించడం సంచలనంగా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా కైలాష్‌పూర్ గ్రామం శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై నుంచి కేవలం ఐదు రోజుల క్రితమే ఆ గ్రామానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే మృతి చెందడం గ్రామంలో భయాందోళనలను రేకెత్తించింది. మృతులను రోజ్ అలీ, భార్య షహనాజ్, ఇద్దరు కూతుళ్లు గుల్నాజ్, తబస్సుమ్, ఒకటిన్నర ఏళ్ల చిన్న కుమారుడుగా పోలీసులు గుర్తించారు.
కుటుంబం గ్రామానికి వచ్చిన తర్వాత కూడా సాధారణంగానే గడుపుతున్నట్లు స్థానికులు చెబుతుండగా, అకస్మాత్తుగా ఇలా విషాదం చోటుచేసుకోవడం మొత్తం ప్రాంతాన్ని కలవరపరిచింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, కొన్ని సందేహాస్పద పరిస్థితులు కనుగొన్నట్లు సమాచారం. ఇంటి తలుపులు లోపల నుంచి మూసి ఉండటం, కుటుంబ సభ్యుల మృతదేహాల దగ్గర కొన్ని అనుమానాస్పద గుర్తులు కనిపించడం విచారణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి, ఆత్మహత్యలా? విషప్రయోగమా? లేక హత్యలా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామంలో ప్రజలు ఇంకా భయంతో వణుకుతుండగా, ఈ కేసు వెనుక అసలు నిజం వెలుగులోకి రావాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV