
తిరుచానూరు, 16 నవంబర్ (హి.స.)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి (Padmavathi Ammavaru) కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబరు 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలను (Karthika Brahmotsavalu) అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుచానూరు (Tiruchanuru), తిరుపతిలలోని (Tirupathi) పలు వేదికలపై ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
తిరుచానూరు ఆస్థానమండపంలో ప్రతి రోజు ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు లక్ష్మీ సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం చేయనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తామృతం (ధార్మికోపన్యాసం), ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది.
అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు హరికథ పారాయణం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు అన్నమయ్య సంకీర్తనలను గానం చేయనున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు, తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV