
న్యూఢిల్లీ, 20 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని ఓ పాఠశాలకు గురువారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. చాణక్యపురిలోని సంస్కృతి పాఠశాలకు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది.
అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సోదాలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ బెదిరింపు బూటకమని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు