
జగిత్యాల, 20 నవంబర్ (హి.స.)
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. మల్లాపూర్ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సౌకర్యాలు, ధాన్యం రవాణా వాహనాల రాకపోకలను పరిశీలించారు. ట్రక్ట్లలో నమోదైన ధాన్యం వివరాలు, ప్రస్తుత సీజన్కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని, లారీ రవాణాలో ఎలాంటి షార్టేజ్ లేకుండా నిశిత పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు