
శబరిమలై, 20 నవంబర్ (హి.స.)
అయ్యప్ప భక్తుల శరణు ఘోషతో
శబరిమల కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు వర్చువల్ క్యూ ద్వారా 70 వేల మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అయితే, దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ భక్తులకు తప్పనిసరి చేశారు. పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు.
కాగా, నీలక్కల్, వండిపెరియార్–సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్లో వర్చువల్ పాస్లు ఇచ్చే స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు దేవస్థానం సిబ్బందికి సహకరించాలని పోలీసులు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఓ ప్రకటన విడుదల చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..