
జైపూర్, 20 నవంబర్ (హి.స.)రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అత్యంత భద్రత ఉండే వీవీఐపీ ప్రాంతంలో గురువారం తీవ్ర కలకలం రేగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్ సింగ్ రావత్ అధికారిక బంగ్లాలోకి ఓ చిరుతపులి చొరబడింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.
జైపూర్‌లోని సివిల్ లైన్స్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోనే రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బంగ్లాలు ఉన్నాయి. మంత్రి రావత్ బంగ్లాకు ఎదురుగానే మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నివాసం కూడా ఉంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన మంత్రి బంగ్లాకు చేరుకున్నారు. ప్రాంగణంలో చిరుత పాదముద్రలను గుర్తించి, అది లోపలే ఉన్నట్లు ధ్రువీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV