
తిరుమల, 20 నవంబర్ (హి.స.)
: భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. Global Hindu Heritage Foundation, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విధమైన అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV