
కర్నూలు, 23 నవంబర్ (హి.స.)కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక రెండు లారీల మధ్య ఓ ప్రైవేటు బస్సు చిక్కుకుపోవడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైత్రి ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాదు నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లెమెట్ట వద్దకు రాగానే, అదుపుతప్పిన బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ.. నిలిచిపోయిన బస్సును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు బస్సులోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే మూడు 108 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన పది మందిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV