
,జంగారెడ్డిగూడెం, 23 నవంబర్ (హి.స.) :అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తెలుగు యువకుడు పట్నాల అభయ్(32) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన స్వస్థలమైన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. అభయ్ తండ్రి పట్నాల సోమశేఖర్ జంగారెడ్డిగూడెంలోని జడ్పీ బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు. సోమశేఖర్, శ్రీదేవి దంపతులకు అభయ్, రాహుల్ అనే ఇద్దరు కుమారులు కాగా, ఇద్దరూ అమెరికాలోనే ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. 14 ఏళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన అభయ్ చదువు పూర్తయ్యాక అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఇల్లు కూడా కొనుక్కున్నారు.
2021లో రాహుల్ కూడా అమెరికా వెళ్లి... అన్న కొన్న ఇంట్లోనే ఉంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అభయ్ స్వదేశానికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు భావిస్తుండగా.. ఇంతలోనే మరణవార్త రావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ నెల 16న అభయ్ సహోద్యోగులైన మరో ముగ్గురితో కలిసి అయ్యప్ప మాల ధరించారు. పక్కనే ఉన్న స్నేహితుడి ఇంటివద్ద అయ్యప్ప పీఠం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ పూజలు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం పదిగంటలకు స్నేహితుడి ఇంటివద్ద మాట్లాడుతుండగానే అభయ్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ