
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) వాయుసేనలో ఉద్యోగాలు ఇప్పిస్తానని
చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ ఎయిర్ఫోర్స్ అధికారి సైదాబాద్ పోలీసుల వలలో చిక్కాడు. భారత వాయుసేన యూనిఫాం ధరించి తనను నిజమైన ఎయిర్ఫోర్స్ ఉద్యోగిగా పరిచయం చేస్తూ యువతను నమ్మించడమే కాక, పలు మహిళలను ప్రేమ పేరుతో మోసగిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. అతను ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువత నుండి డబ్బులు దోచుకుంటున్నాడు. అంతేకాదు, నేను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని... అత్యున్నత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి” అంటూ పలు మహిళలతో పరిచయాలు పెంచుకుని సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నకిలీ యూనిఫాం, నకిలీ ఐడీలతో పాటు మరి కొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు