
అమరావతి, 6 నవంబర్ (హి.స.) విద్యుత్తు వినియోగదారులకు ఈ నెల నుంచి బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేసి పేదలను ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. వాటిని నవంబరు నుంచి 13 పైసల వరకు తగ్గిస్తుండటంతో వినియోగదారులకు ఆర్థికంగా మేలు చేకూరుతుందని వెల్లడించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చౌడువాడ, కింతలిలో బుధవారం నూతనంగా నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రాలను ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రూ.250 కోట్లతో 69 విద్యుత్తు ఉపకేంద్రాలు నిర్మిస్తున్నామని చెప్పారు. 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సౌరవిద్యుత్తు యూనిట్లు ఉచితంగా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఇద్దరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ