
గద్వాల, 6 నవంబర్ (హి.స.)
రైతులు పండించిన ధాన్యం ఒక్క
గింజ కూడా వృథా కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ధరూర్ మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులకు మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేశారు. దళారులకు విక్రయించి నష్టపోకుండా రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తేవాలని సూచించారు. “సన్నవడ్లపై అదనంగా రూ.500 బోనస్ అందిస్తోంది ప్రభుత్వం. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమవుతాయి” అని తెలిపారు. రైతులు సరైన పద్ధతిలో పంట సాగు చేయాలని, అధిక యూరియా వినియోగం తగ్గించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు