
బాపట్ల, 6 నవంబర్ (హి.స.)ప్రధాన సర్కిల్ వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు.. లారీని వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన బాపట్లలోని గడియార స్తంభం సెంటర్ దగ్గర చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రీకార్డు అయింది. అందులో అతి వేగంగా దూసుకొచ్చిన యువకులు నేరుగా లారీని ఢీకొట్టడం స్పష్టంగా కనిపించింది. మృతులు గుంటూరుకు చెందిన షేక్ జాన్ (22), నాని (20)గా గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఇద్దరు యువకులు స్నేహితులతో కలిసి బాపట్ల బీచ్‌ను సందర్శించడానికి వచ్చారు. అయితే, అధికారులు బీచ్‌లోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌లో బైక్ అధిక వేగంతో వచ్చి లారీని ఢీకొన్న దృశ్యాలు నమోదవ్వగా, ప్రమాదంపై కేసు నమోదు చేసి బాపట్ల పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV