
అమరావతి, 7 నవంబర్ (హి.స.)విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్ 65 ఆరు వరుసల విస్తరణకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధమైంది. దీన్ని మరో పది రోజుల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ(పీఏటీఎస్‌సీ) ముందుంచనున్నారు. జిల్లా పరిధిలో మొత్తం 50 కి.మీ మేర రహదారిని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరిస్తున్న నేపథ్యంలో రెండు బైపాస్‌లు, ఓ వంతెన నిర్మాణం చేపడతారు.
రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 231.32 కి.మీ మేర రహదారిని నాలుగు నుంచి ఆరు వరుసలుగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా పరిధిలో మాత్రమే 22 కి.మీ మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు (కొత్తగా రహదారి నిర్మాణం) చేపడుతున్నారు. నందిగామ మండలం అంబారుపేట- ఐతవరం మధ్యలో 7.3 కి.మీ మేర ఒక బైపాస్ (అందులో 6.5 కి.మీ గ్రీన్‌ఫీల్డ్) నిర్మిస్తారు. ఇందులో అంతర్భాగంగా అంబారుపేట, ఐతవరం దిగువన కీసర సమీపంలో మునేరు మీద కొత్తగా ఆరు వరుసల వంతెన నిర్మాణం చేపడతారు. ఇబ్రహీంపట్నం మండలం కాచవరం నుంచి మూలపాడు మీదుగా ఇబ్రహీంపట్నం వరకు 16.15 కి.మీ మేర మరో బైపాస్ రోడ్డు (ఇందులో 15.6 కి.మీ గ్రీన్‌ఫీల్డ్) నిర్మాణం చేపడతారు. డీపీఆర్‌లో మొత్తం నాలుగు ఆప్షన్లు తయారు చేశారు. అయితే మొదటి ఆప్షన్ ఎంపిక చేసినట్లు సమాచారం. దీని ప్రకారం రెండు వెహికల్ అండర్ పాస్‌లు, రెండు లైట్ వెహికల్ అండర్ పాస్‌లు, నాలుగు ఎస్‌వీయూపీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి 55 హెక్టార్ల వరకు భూమి సేకరించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ