
గన్నవరం 7 నవంబర్ (హి.స.)
,:కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (94) కన్నుమూశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన అవుటపల్లి ఋషి వాటికలోని ఆయన స్వగృహమునందు గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో 1992లో రెండో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జానకిరామయ్య.. స్వల్పకాలంలోనే సంస్థను లాభాల బాట పట్టించారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర ఇవ్వడంతో పాటు రైతులకు బోన్‌సలు పంపిణీ చేసింది జానకిరామయ్యే. ఉద్యోగులకు కూడా బోన్‌సలు ఇచ్చేవారు. ఆయన సేవలను గుర్తించిన ఇండియన్ డెయిరి అసోసియేషన్.. వర్గిస్ కురియన్ అవార్డుతో ఆయనను సత్కరించింది. అందుకే జానకిరామయ్యను ఆంధ్రా కురియన్‌గా పిలుస్తారు. ఆయన భౌతికకాయానికి అల్లాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ