
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) దీపం అడ్డుకొని తీవ్ర గాయాలపాలైన ఏడేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులతో నాగారం మున్సిపాలిటీలోని ఆర్.ఎల్. నగర్ లో నివాసముంటున్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు.
అయితే మధుసూదన్ రెడ్డి కుమార్తె సాయి నేహా రెడ్డి(7)కి ఇంట్లో ప్రమాదవశాత్తు దుస్తులకు దీపం అంటుకోవడంతో కేకలు వేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్ పురిలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు ఖార్కానాలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా 90 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు