
అమరావతి, 8 నవంబర్ (హి.స.)చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఆన్‌లైన్‌లో మాట్లాడారు. కుప్పానికి త్వరలో రూ.6,300 కోట్ల పెట్టుబడులతో మరో 8 కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మొత్తం స్థానికంగానే తయారు చేస్తామన్నారు. ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు సౌరవిద్యుత్ అందిస్తామని చెప్పారు.
‘‘ కుప్పంలో డెయిరీ, పౌల్ట్రీ రంగం విస్తరించాలి. గతంలో కుప్పంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రారంభించా. ఆ తర్వాత రైతుల పిల్లలు కూడా ఐటీ చదివారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఐటీ ఉద్యోగాలు చేసిన వారిలో కొందరు పారిశ్రామికవేత్తలుగా మారారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35శాతం తెలుగువాళ్లే. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలి. కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం. ఇప్పటికే కుప్పంలో యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రోత్సహిస్తాం. ఇక్కడి నుంచి విదేశాలకు నాణ్యమైన పండ్లు ఎగుమతి చేస్తాం. ఎవరికి ఏ వ్యాధి ఉన్నా.. ఇంటివద్దే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటాం. ఏఐ.. భవిష్యత్‌లో మీకు ఆరోగ్య సలహాదారుగా మారుతుంది’’ అని చంద్రబాబు అన్నారు. నిర్దేశించిన సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని సూచించారు. రూ.2,203 కోట్ల పెట్టుబడితో కుప్పంలో 7 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాగా.. వాటికి ప్రభుత్వం అనుమతులిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ