
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బ్యాడ్
బ్రదర్స్ అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఉపఎన్నికలో ఓడిపోతే తన సీఎం పదవి ఎక్కడ పోతుందోనే ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ, ప్రధానిపై సీఎం తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయంటూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారని అన్నారు. సీఎం రేవంతు భయపడే వారు ఇక్కడ ఎవ్వరూ లేరని కౌంటర్ అటాక్ చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయం, కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంలో తమకు రేవంత్రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలా తమది అవినీతి పార్టీ కాదని అన్నారు. తాము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తిన్న రూ. లక్ష కోట్లు కక్కిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారని, లక్ష రూపాయలైన కక్కించారా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందన్నారు. మాటిమాటికి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని ప్రచారం చేస్తున్నారని.. సీఎంకు చీము, నెత్తురుంటే చేస్తున్న ఆరోపణపై ఆధారాలు చూపాలని కిషన్రెడ్డి సవాల్ విసిరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..