
తెలంగాణ, 8 నవంబర్ (హి.స.) ఆసియా కప్ ఛాంపియన్ భారత జట్టు
మరో పొట్టి సిరీస్ ను పట్టేసింది. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షార్పణం కావడంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
గబ్బాలో భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ వద్ద అంతరాయం కలిగించిన వర్షం.. ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు. దాంతో.. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ బృందం విజేతగా నిలిచింది.
పొట్టి క్రికెట్లో తమకు తిరుగులేదని భారత జట్టు మరోసారి చాటుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ చేజారినా.. తమకు కొట్టినపిండి అయిన టీ20ల్లో కంగారూ టీమ్కు షాకిచ్చింది టీమిండియా. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆతిథ్య జట్టు గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. కాంబినేషన్లో మార్పులు చేసుకున్న టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో కంగారూలకు చెక్ పెట్టింది. పేసర్ అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh), ఓపెనర్ అభిషేక్ శర్మలు మెరవడంతో మూడో మ్యాచ్లో.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గొప్పగా రాణించడంతో నాలుగో టీ20లో మార్ష్ సేనను మట్టికరిపించింది. నిర్ణయాత్మకమైన ఐదో మ్యాచ్ వర్షార్పణం కావడంతో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియాను విజేతగా ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు