
వారణాసి, 8 నవంబర్ (హి.స.)
ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ (PM Modi) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగు వందే భారత్ రైళ్ల (Vande Bharat Express)ను ఆయన ప్రారంభించారు. బనారస్- ఖజురహో, లఖ్‌నవూ- సహరన్‌పుర్, ఫిరోజ్‌పుర్- దిల్లీ, ఎర్నాకుళం- బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
బనారస్ రైల్వేస్టేషన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. దీన్ని అభివృద్ధి పండుగగా ఆయన అభివర్ణించారు. ‘పవిత్రమైన ఈ ప్రాంతంలో అద్భుతమైన దేవ్ దీపావళి జరిగింది. ఈ అభివృద్ధి పండుగ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అనేక దేశాల అభివృద్ధిలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. మెరుగైన కనెక్టివిటీతో నగరం అభివృద్ధి చెందుతుంది. గత 11 ఏళ్లలో ఉత్తరప్రదేశ్‌లో ఆర్థికవ్యవస్థ మంచిగా వృద్ధి చెందింది. యాత్రికుల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.వేల కోట్లు వచ్చాయి’ అని మోదీ అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు