
ముంబై, 8 నవంబర్ (హి.స.)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ భూ కుంభకోణం కేసు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ రూ.200 కోట్ల విలువైన భూమిని.. రూ.3 కోట్లకే దక్కించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతాప్ సర్‌నాయక్ మీరా భయందర్‌లో దాదాపు రూ.200 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని రూ.3 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. అక్కడ ఆయన ఓ విద్యాసంస్థను ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆరోపణలపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పందించారు. దీని గురించి తాను కూడా విన్నానని.. కానీ, దీనిపై ఇప్పటివరకు ఎవరినుంచి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రతిపక్షాలు తమకు ఫిర్యాదు చేయడం కాకుండా.. మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసేందుకు సమయం కేటాయిస్తున్నారన్నారు. దీనికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే తాము తప్పక చర్యలు తీసుకుంటామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు