
నిజామాబాద్, 8 నవంబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. బ్రిడ్జిని అసంపూర్తిగా వదిలేయడంతో వాహన రాకపోకలు సాగించడం వల్ల విపరీతమైన దుమ్ము నివాసాల్లోకి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే సమస్యను పరిష్కరించాలని కోరినప్పటికి కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పాలకులు, అధికారుల తీరును నిరసిస్తూ ఆర్మూర్ వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు