
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణను తాము నిర్లక్ష్యం చేశామని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు.
తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ జరిగేవిధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కు కేంద్ర మంత్రి లేఖ రాశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..