
తెలంగాణ, 9 నవంబర్ (హి.స.)
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాలపై 25 రోజులపాటు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో భారీ సైబర్ మోసాలు బట్టబయలయ్యాయి. ఈ మేరకు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖ గోయల్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్లో 81 మంది సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో 7 మంది మహిళలు ఉన్నారు. కేరళలో 28, మహారాష్ట్రలో 23, ఆంధ్రప్రదేశ్లో 10, తమిళనాడులో 7, కర్ణాటకలో 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో 17 మంది ఏజెంట్లు, 11 మంది చెక్, నగదు ఉపసంహరణల్లో, 53 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి ఖాతాల ద్వారా రూ.34.70 లక్షల మోసపూరిత లావాదేవీలు జరిగాయని తేలింది.
ఆపరేషన్లో భాగంగా 84 మొబైల్ ఫోన్లు, 101 సీమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్బుక్స్, చెక్ బుక్ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బ్యాంక్ ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, ప్రైవేట్ ఉద్యోగులు, బ్రోకర్లు, విద్యార్థులు, రోజువారీ కూలీలు వరకు ఉన్నారు. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు 106 కేసులకు సంబంధించి నేరప్రవర్తనలో నేరుగా పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్లో 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో 41 కేసులు నమోదు అయ్యాయి. కొందరు నిందితులకు విదేశీ సంబంధాలు ఉన్నట్లు గుర్తించగా, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్లు (LOCs) జారీ చేయడానికి చర్యలు ప్రారంభించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు