
సంగారెడ్డి, 9 నవంబర్ (హి.స.)
ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం
ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండల పరిధిలోని చేర్యాల గేటు వద్ద ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం ఢీ కొట్టింది.
దీంతో వాహనంలో ఉన్న నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన బాలయ్య (52) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తూప్రాన్ మండలం అల్లాపూర్ కు చెందిన ప్రవీణ్, న్యాల్కల్ మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన ఫరీద్, సిర్గాపూర్ గ్రామానికి చెందిన సీతారాం, రాయచూరు కు చెందిన కాలప్ప అనే వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు