
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)
భారతదేశ సైక్లింగ్ చరిత్రలో మరో మైలురాయి నెలకొల్పుతూ, హెచ్సీఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI) పర్యవేక్షణలో ఆదివారం నిర్వహించిన HCL సైక్లోథాన్ హైదరాబాద్ 2025 రికార్డు స్థాయి హాజరుతో విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 1,900 మందికి పైగా ప్రొఫెషనల్, అమెచ్యూర్ సైక్లిస్టులు, ఫిట్నెస్ ప్రియులు ఈ ప్రతిష్టాత్మక సైక్లింగ్ పోటీలో పాల్గొన్నారు. ఉస్మాన్ నగర్, వట్టినాగులపల్లి ప్రాంతంలోని ప్రైమ్ అరేనా నుంచి ప్రారంభమైన ఈ రేస్, నగరంలోని ఆధునిక దృశ్యాలు, పచ్చని పరిసరాలను దాటుతూ తిరిగి అదే ప్రదేశంలో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైక్లిస్టులు వివిధ విభాగాల్లో పోటీ పడి, మొత్తం రూ. 33.6 లక్షల బహుమతి నిధి కోసం తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇది భారతదేశంలో ఏ సైక్లింగ్ రేస్కీ లేని అత్యధిక బహుమతిగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. హెచ్సీఎల్ సైక్లోతాన్ వంటి కార్యక్రమాలు ఫిట్నెస్, సస్టైనబిలిటీ, కమ్యూనిటీ వెల్బీయింగ్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..