
అమరావతి, 9 నవంబర్ (హి.స.)మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట, ఆస్తి నష్టాలు జరిగాయి. ఇప్పటికే నష్టానికి సంబంధించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. నష్టపరిహారం (Compensation) కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ క్రమంలో మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (Inter Ministerial Central Team) సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (Prakhar Jain) వెల్లడించారు. వీరు రెండు బృందాలుగా ఏర్పడి సోమవారం టీం వన్ బాటప్ల జిల్లాలో, టీం టూ కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. మంగళవారం టీం వన్ ప్రకాశం జిల్లాలో, టీం టూ కోనసీమ జిల్లాల్లో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV