
విజయనగరం, 13 డిసెంబర్ (హి.స.)విజయనగరం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లాం మండలం కె. సీతాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో పది పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల ప్రకారం, చలి తీవ్రత అధికంగా ఉండటంతో పాపమ్మ తన గుడిసెలో చలి మంట (కుంపటి) పెట్టుకున్నారు. ఆ కుంపటి నుండి ఎగిసిన నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గడ్డికి అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పూరి గుడిసె కావడంతో మంటలు క్షణాల్లో ఇతర గుడిసెలకు వ్యాపించాయి. పక్కపక్కనే ఉన్న మరో తొమ్మిది గుడిసెలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాపమ్మ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా, పది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV