
అమరావతి, 19 డిసెంబర్ (హి.స.)
వైసీపీ (YCP) నేతలు రాష్ట్రాభివృద్ధిన అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు అని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో అభివృద్ధి చేయనున్న రహేజా ఐటీ పార్క్ (Visaka Raheja IT Park) భూకేటాయింపుల విషయంలో హైకోర్టులో పిల్ దాఖలు కావడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కానిస్టిట్యూషన్ పేరిట వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిల్ ను హైకోర్టులో దాఖలు చేశారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. ఐటీ పెట్టుబడులు, యువతకు ఉద్యోగాల కల్పనపై వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. యువత భవిష్యత్తుపై మాజీ సీఎం వైయస్ జగన్ ద్వేషంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా వంట సంస్థలపై పిటిషన్లను వైసీపీ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా రహేజా ఐటీ పార్క్ విషయమై పిల్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టారు. ఆ ప్రాజెక్టులతో ఏపీ యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు అందివచ్చే అవకాశం ఉందన్నారు. కానీ వైసీపీ నేతలు ఆ అవకాశాలను రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV