
విశాఖపట్నం, 19 డిసెంబర్ (హి.స.)
విశాఖపట్నంలోని వైజాగ్ స్లీట్ ప్లాంట్ (Vizag Steel Plant) లో పెను ప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-1లో స్వల్ప అగ్నిప్రమాదం (Minor Fire Accident) చోటు చేసుకుంది. అయితే ఉద్యోగుల అప్రమత్తతతో మంటలు వ్యాపించకుండా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి ప్లాంట్ లోని కోక్ ఓవెన్ బ్యాటరీ-1 విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. జీసీఎం గ్యాస్ పైప్ లైను నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బ్యాటరీ వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఆకస్మిక్ పరిణామంతో కాస్త కంగారు పడ్డారు. అయినప్పటికీ వెంటనే తేరుకొని మంటలు వ్యాప్తి చెందకుండా ఆపేందుకు చర్యలు చేపట్టారు. హుటాహుటిన చార్జింగ్ కారును నిలిపివేసి గ్యాస్ మంటలను వారు అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైందని వారు చెబుతున్నారు. మంటలను అదుపు చేస ఉండకపోతే అవి వ్యాపించి భారీ నష్టం సంభవించేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రతా ప్రమాణాలను మరింత పెంచాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV